బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది (2024) జూలై-ఆగస్టు మధ్య జరిగిన హింసాత్మక విద్యార్థి నిరసనలను అణచివేయడంలో ఆమె పాత్ర ఉన్నందున, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో 1,400 మందికి పైగా మరణించారు.

షేక్ హసీనాతో పాటు, మాజీ హోం శాఖ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ కమల్‌కు కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. పదవిని నిలుపుకోవడానికి, నిరసనలను అణచివేయడానికి హసీనా, ఖాన్ కమల్ ఇద్దరూ 'నరమేధం'కు పాల్పడినట్లు ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే, కోర్టు ఆవరణతో పాటు ఢాకాలోని ప్రధాన నగరాల్లో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.

తీర్పుపై హసీనా స్పందన

ప్రస్తుతం దేశం వెలుపల ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా, ట్రిబ్యునల్ తీర్పుపై తీవ్రంగా స్పందించారు. ఇది పక్షపాతంతో, రాజకీయ ప్రేరేపితంతో కూడిన తీర్పు అని ఆమె కొట్టిపారేశారు. "న్యాయమూర్తులు పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరించారు. తాను నిర్దోషిని అని నిరూపించుకునే అవకాశాన్ని కోర్టు ఇవ్వలేదు" అని ఆమె ఆరోపించారు. ఎన్నిక కాని ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వం తప్పుడు తీర్పు ఇప్పించిందని ఆమె విమర్శించారు.

తాజా పరిణామాలు

కాగా, హసీనాను తమకు అప్పగించాలని కోరుతూ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే, 2013లో భారత్-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన అప్పగింత ఒప్పందం (Extradition Treaty) ప్రకారం, రాజకీయ నేరస్థులను అప్పగించడాన్ని తిరస్కరించే హక్కు భారత్‌కు ఉంది. దీని దృష్ట్యా, భారత్ హసీనాకు రక్షణ కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.