ఐ-బొమ్మ వెబ్సైట్ మూసివేత: సైబర్ నిపుణుడు రవి అరెస్ట్, రూ. 3 కోట్లు స్వాధీనం
సినిమా పైరసీకి అడ్డాగా మారిన ఐ-బొమ్మ (i-bomma), బప్పం టీవీ (bappam TV) వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. ఈ సైట్‌లను నిర్వహించిన ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సైట్‌లను సృష్టించిన రవి చేతులతోనే వాటిని పూర్తిగా నిలిపివేయించినట్లు సమాచారం.
నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన సంచలన విషయాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. కూకట్‌పల్లిలోని రవి అపార్ట్‌మెంట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించి, రూ. 3 కోట్ల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
వైజాగ్ ప్రాంతానికి చెందిన రవి, టెక్నికల్ అంశాలలో అత్యంత నిపుణుడని పోలీసులు గుర్తించారు. ప్రపంచంలో ఎంత భద్రంగా ఉంచిన సర్వర్‌నైనా సులభంగా హ్యాక్ చేయగల సామర్థ్యం అతనికి ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. కొత్త సినిమాలను భద్రపరిచే 'క్లౌడ్ ఫ్లేర్' (Cloud Flare) నెట్‌వర్క్‌ను కూడా హ్యాక్ చేసి, వాటిని కరేబియన్ దీవుల నుంచి ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది.
IBomma పేరుతో 70కి పైగా మిర్రర్ సైట్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. IBomma, bappam, IRadha పేర్లతో ప్రధాన వెబ్‌సైట్‌లను నడుపుతున్నాడు. రవికి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్మాతలు విడుదల కోసం డిజిటల్ మీడియా సంస్థలకు అందించే సినిమాలను లక్ష్యంగా చేసుకుని ఇతను పైరసీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Comments (0)
No comments yet. Be the first to comment.
Please log in or register to post a comment.